తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలా పల్లెల్లో ప్రగతికి అదే స్పూర్తితో పనిచేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ సమ్మేళనంను నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, జడ్పీ చైర్మన్ దీపికా యుగంధర్ రావు, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ... పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం పెరిగిందన్నారు. గ్రామీణాభివృద్ధి ప్రణాళికలకు రూపం ఇచ్చినా శిల్పి సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఆశించిన పద్దతిలో పల్లెలు ప్రగతిలో పరుగులు పెట్టాలన్నారు. కష్టపడి పనిచేసే ప్రజాప్రతినిధుల మీద ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుందన్నారు. పర్యావరణ సమస్య మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిందని.. ఇటువంటి భయానక సమస్యను అధిగమించేందుకు పల్లెప్రగతి తోడ్పడాలన్నారు. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించేలా పల్లె ప్రగతి ఉండాలని సూచించారు. ప్రజలను బెంబేలిస్తున్న సమస్య చెత్త డంపింగ్. ఈ సమస్యకు పరిష్కారమే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు అన్నారు. అదేవిధంగా ప్రతీ గ్రామం శ్మశాన వాటికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లోని శ్మశాన వాటిక రాష్ర్టానికే రోల్ మోడల్‌గా మారిందన్నారు. అభివృద్ధి రుచి తెలిసిన గ్రామాలు మరింత అభివృద్ధికి పోటీ పడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఉద్యమస్ఫూర్తితో పల్లెల ప్రగతికి పనిచేయాలి: మంత్రి జగదీష్‌రెడ్డి