గ్రామాల అభివృద్దితోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ది సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లిలో నిర్వహించిన పంచాయతీరాజ్ సమ్మేళనంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ... పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారన్నారు. పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి ఆ దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని స్వరాష్ట్రంలో గొప్పగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి నెల రూ. 339 కోట్ల రూపాయలను ప్రభుత్వం గ్రామంచాయతీలకు మంజూరు చేస్తుందని వెల్లడించారు. 12,750 మంది కొత్త గ్రామ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. స్వచ్ఛ గ్రామాలు, విద్యా, వైద్య, ఆరోగ్య తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. సీఎం కేసీయార్ ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అధికారులకు, ప్రజాప్రతినిదులకు సూచించారు. సర్పంచులు, అధికారులు విద్య, వైద్యం, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు, స్మశానవాటికల నిర్మాణాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారం ద్వారా నాటిన 85 శాతం మొక్కలు బ్రతికే విధంగా గ్రామపంచాయతీలు కృషి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి , ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్ భారతి హోళీ కేరి, తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్దితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ది సాధ్యం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి